Health & Lifestyle

సొర కాయ ఆరోగ్య ప్రయోజనాలు

KJ Staff
KJ Staff
Bottle Guard
Bottle Guard

సొర కాయ కూర అనగానే ముఖం చిట్లించే పిల్లలనే మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ కూరగాయలను రకరకాలుగా చేసి పిల్లలకు నచ్చేలా చేసే తల్లులను కూడా చూస్తుంటాం.

దీనికి ప్రత్యేకంగా తీపి, ఉప్పు వంటి రుచి లేకపోవడం వల్ల దీన్ని కూరలు, స్నాక్స్ వంటివాటిలోనే కాదు.. ఖీర్ వంటి తీపి పదార్థాల్లోనూ ఉపయోగిస్తుంటారు. ఇంగ్లిష్ లో బాటిల్ గార్డ్ లేదా వైట్ ఫ్లవర్ గార్డ్ కలాబిష్ గార్డ్ వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. సొర కాయ, గుమ్మడి కాయ అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. లేతగా ఉన్నప్పుడు కూరల కోసం వినియోగించే వీటిని ముదిరిపోయి ఎండిపోయిన తర్వాత వంట సామాగ్రి, పాత్రల్లాంటివి తయారుచేయడానికి కూడా వినియోగిస్తారు. ఇది చాలా రకాల షేప్స్ లో లభిస్తుంది. పొడుగ్గా, సిలిండ్రికల్ షేప్ లో, గుండ్రంగా, చిన్నగా, బాటిల్ షేప్ లో, గుమ్మడి కాయ షేప్ లో సన్నగా పొట్లకాయ షేప్ లో వివిధ రకాలుగా దొరుకుతుంది. ఈ మొక్కలను మొదట కేవలం పాత్రల తయారీ కోసమే పెంచేవారట. ఆ తర్వాత వీటిని తినడం ప్రారంభించారు. ఇందులోని పోషక విలువలు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడానికి కారణం.

సొర కాయలోని పోషకాలు (100గ్రా)

క్యాలరీలు: 15

ప్రొటీన్: 0.4 గ్రా

కార్బొహైడ్రేట్లు: 8.6గ్రా

ఫైబర్: 3.1 గ్రా

ఫ్యాట్: 1 గ్రా

కొలెస్ట్రాల్:0.1ఎంజీ

విటమిన్లు:174.9 ఎంజీ

మినరల్స్:249.5 ఎంజీ

సొర కాయను ఎందుకు తీసుకోవాలంటే..

చాలామంది డాక్టర్లు డైటీషియన్లు, డాక్టర్లు సొర కాయను ఎక్కువగా తీసుకోమని చెబుతూ ఉంటారు. దీనికి కారణం ఇందులో క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉండడమే. ఇందులో 96 శాతం నీరే ఉంటుంది. కొద్ది మొత్తంలో నీటిలో కరిగే పీచు ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనే వారికోసం ఇది చక్కటి ఎంపిక. అంతేకాదు.. డయాబెటిస్ ఉన్నవారు, రక్త పోటు, ఇతర లైఫ్ స్టైల్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచిది. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఇందులో మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివాటితో పాటు విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

తాజాదనం ఎలా చెక్ చేయాలంటే..

సొర కాయను బయట కొనేటప్పుడు దాని తాజాదనం చెక్ చేసి ముదిరిపోలేదని తెలిసిన తర్వాతే దాన్ని కొనాలి. కాయ మీద ఎలాంటి కట్స్ ఉండకూడదు. మచ్చలు, మరకలు ఉండకూడదు. అలాగే వత్తినప్పుడు గట్టిగా ఉండాలి. గోరుతో లోపలికి గిచ్చినప్పుడు గోరు సులువుగా లోపలికి వెళ్లాలి. అప్పుడే సొర కాయ లేతగా ఉన్నట్లు లెక్క. అయితే మార్కెట్లో కొనడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇంట్లోనే వీటిని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇవి సంవత్సరం మొత్తం కాపును అందిస్తాయి. కానీ వేసవి, వర్షాకాలంలో ఎక్కువ కాయలు వస్తాయి. మీకు ఇంట్లో మొక్కలు పెంచేందుకు స్థలం ఉంటే ఫర్వాలేదు. లేకపోతే ఒక పెద్ద బకెట్ లేదా కంటెయినర్ లో సొర కాయ విత్తనాలు నాటి తీగ బిల్డింగ్ మీదకు పాకించవచ్చు. దీనివల్ల సులువుగా వీటి నుంచి ఫలసాయం పొందే వీలుంటుంది.

సొర కాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

సొర కాయను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. . వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే..

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

సొర కాయలో నీటిలో కరిగే, నీటిలో కరగని రెండు రకాలకు చెందిన పీచు పదార్థాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే ఫైబర్ మల బద్ధకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. దీన్ని అరిగించుకోవడం కూడా చాలా సులువు. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తే తప్పనిసరిగా ఈ జ్యూస్ ని తాగాలని డాక్టర్లు చెబుతుంటారు.

బరువు తగ్గించడంలో తోడ్పడతుంది.

విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివన్నీ సొర కాయలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అందుకే ఇది ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఉదయాన్నే జ్యూస్ రూపంలో తాగితే ఇది చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ ఎలాంటి కూరగాయలకు సంబంధించిన జ్యూస్ తాగేముందు అయినా సరే.. మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆయుర్వేద నిపుణులు రోజూ సొర కాయను తీసుకోవాలని చెబుతుంటారు. దీనికి కారణం అది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇది లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. లివర్ వాపు, సమస్య ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

షుగర్ లెవల్ కంట్రోల్ చేస్తుంది.

సొర కాయలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకే డయాబెటిస్ సమస్య ఉన్నవారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంతే కాదు.. గాయాల నుంచి కోలుకునే వారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గుండెను కాపాడుతుంది.

సొర కాయలో పొటాషియం, సోడియం ఇంకా ఎన్నో ఎస్సెన్సియల్ మినరల్స్ ఇందులో ఉంటాయి. రక్త పోటును ఇది కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె జబ్బులు వచ్చే ముప్పును కూడా తగ్గిస్తుంది.

చలువదనాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది. ఎండలు మనల్ని ఠారెత్తిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సొర కాయ తినడం వల్ల వేడి తగ్గి చలువ చేస్తుంది. ఇందులో 96 శాతం నీరు ఉంటుంది. అందుకే క్యాలరీలు తక్కువగా ఉన్న నోరూరించే డ్రింక్ ని దీనితో తయారుచేసుకునే వీలుంటుంది. ఇది ఫ్రెష్, రిలాక్స్డ్ ఫీలింగ్ ని అందిస్తుంది.

https://krishijagran.com/agripedia/bottle-gourd-cultivation-how-to-get-higher-productivity-by-using-3g-technology/

https://krishijagran.com/agriculture-world/the-most-demanding-and-profitable-crops-to-grow-in-february/

Share your comments

Subscribe Magazine