Health & Lifestyle

రోజు ఒక గుడ్డు ఎందుకు తినాలి... గుడ్డు వల్ల లాభాలేమిటి?

KJ Staff
KJ Staff

మన నిత్య ఆహారంలో పోషకాహార లోపాన్ని సవరించుకోడానికి ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే మన నిత్య జీవక్రియకు అవసరమైన అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంటూ, ప్రోటీన్స్, మినరల్స్,విటమిన్ ఎ , డి, బి-కాంప్లెక్స్‌ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే చాలామంది గుడ్డును ప్రతి రోజూ తినడం వల్ల శరీర బరువు పెరగడంతోపాటు అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని గుడ్లు తినడం మానేస్తున్నారు. అది అపోహ మాత్రమే.

ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని దీన్ని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఒకే రోజు ఎక్కువ గుడ్లను తినకపోవడమే మంచిది.ప్రతిరోజు ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం.

చిన్న పిల్లలు ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల వారి శరీర ఎదుగుదలతో పాటు, మెదడు చురుకుగా పనిచేసి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే ముప్పు కూడా తక్కువ. అలాగే వృద్ధాప్యంలో మెదడు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. గుడ్డులో ఉండే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి చూపును మెరుగు పరిచి కంటి సమస్యలను తొలగిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే ఐరన్‌ మన శరీరం తేలికగా గ్రహించి ప్రమాదకర రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది.కాబట్టి ప్రతిరోజు నిక్షేపంగా ఒక గుడ్డు ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

Share your comments

Subscribe Magazine