Health & Lifestyle

చుండ్రు సమస్య వెంటాడుతోందా.. వేపాకుతో చెక్ పెట్టండిలా!

Srikanth B
Srikanth B

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే జుట్టు సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వాతావరణ కాలుష్యం కారణంగా, ఇతర కారణాల వల్ల చుండ్రు ఏర్పడటంతో అధిక మొత్తంలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ కొందరిలో ఈ చుండ్రు సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఈ విధంగా చుండ్రు సమస్యతో బాధపడేవారు సహజసిద్ధంగా మన ఇంటి ఆవరణంలో దొరికే వేపాకుతో చుండ్రుకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చుండ్రుతో బాధపడేవారు వేపాకు ద్వారా ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వేపాకులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వేపాకును గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ వేపాకును ఉపయోగించి ఏ విధంగా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం..

అధిక చుండ్రు సమస్యతో బాధపడేవారు ముందుగా కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు మొత్తం ఆకుపచ్చగా మారే వరకు నీటిని ఉడికించి వాటిని చల్ల పరచుకోవాలి.ముందుగా మన జుట్టును షాంపూతో శుభ్రం చేసుకుని ఆ తర్వాత చల్లగా అయినటువంటి ఈ వేపాకు నీటితో కడగటం వల్ల చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

అదేవిధంగా కొద్దిగా కొబ్బరినూనె లోకి ఒక పది వేపాకులను వేసి నూనెను బాగా వేడిచేయాలి. ఈ విధంగా వేడి చేసిన నూనెను చల్లబరచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ విధంగా భద్రపరచుకున్న వేపనూనెను వారానికి రెండు సార్లు అంటించుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine