అందరి ఇళ్లలోనూ కనిపించే ద్రవరూప ఆహారం ఏదైనా ఉందంటే అది పాలు. పాలు మరియు పాలపదార్ధాలు, ఇంట్లో తరచూ ఏదొక అవసరానికి ఉపయోగిస్తాము. అయితే పాలను నిల్వ చెయ్యడం మాత్రం పెద్ద తలనొప్పి అని చెప్పవచ్చు. పాలు చాలా తొందరగా పాడైపోతాయి, కాబట్టి వీటిని నిల్వచెయ్యడానికి ఫ్రీజర్ వినియోగిస్తాము. అయితే ఏదైనా కారణం వలన ఫ్రీజర్ పాడైతే పాలు పాడవకుండా ఎలా నిల్వ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు సాధారణంగా తీసుకునే ఆహారం, కాబట్టి వీటి వినియోగం ప్రతీ ఇంట్లోనూ సాధారణంగా కనిపిస్తుంది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చెయ్యడానికి ఫ్రీజ్ ఉపయోగిస్తాము, అయితే కొన్ని కారణాల ఫ్రీజ్ పాడైతే పాలు వెంటనే విరిగిపోతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు పాలను కొన్ని పద్దతుల ద్వారా నిల్వ చెయ్యాలి. ముందుగా తక్కువ మంట మీద పాలను బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత తక్కువ మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల పాలల్లో ఉన్న అన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయి. కాబట్టి పాలు ఎక్కువ గంటలు నిల్వ ఉంటాయి. పాలు సరిగా మరగకపోతే బ్యాక్టిరియాలు సజీవంగా ఉండి వాటిని చెడగొడతాయి.
ఇలా మరిగించిన పాలను ఇంట్లోని చల్లని ప్రదేశాల్లో ఉంచడం మంచిది. ఇంట్లోని మిగతా ప్రదేశాలతో పోలిస్తే వంటగదిలో వేడి ఎక్కువుగా ఉంటుంది, కాబట్టి పాలను ఇక్కడ నిల్వ చెయ్యకూడదు. ఇంట్లో ఎండ మరియు గాలి ఎక్కువుగా లేని చల్లని ప్రదేశాల్లో పాలను ఉంచడం ద్వారా వాటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ చెయ్యవచ్చు.
చాలా మంది పాలను స్టీల్ గిన్నెలో నిల్వ చేస్తారు. అయితే దీనికంటే మట్టి కుండలో లేదా గాజు పాత్రలో పాలను నిల్వ చెయ్యడం శ్రేయస్కరం. స్టీల్ గిన్నెతో పోలిస్తే ఈ పాత్రలలో పాలు చల్లగా ఉంటాయి. ఫ్రీజ్ పాడైన సమయంలో పాలను మట్టిపాత్రలో లేదా గాజు గిన్నెలో ఉంచడం మంచిది. అంతేకాకుండా ఇంట్లో ఏసీ ఉన్నవారు, పాలను ఏసీ ఉన్న గదిలో ఉంచితే అవి పడిపోకుండా కాపాడవచ్చు.
పాలగిన్నెను నీరు ఉంచిన పాత్రలో దించాలి. పాల గిన్నె మునిగిపోయేంత నీళ్లు వేయకూడదు. ఇలా చేయడం వల్ల పాలు చల్లగా ఉంటాయి. కాబట్టి పాలు చెడిపోవు. లేదా చల్లటి నీటిలో నానబెట్టిన వస్త్రాన్ని చుట్టి పాల గిన్నెను దానిపై ఉంచాలి. ఇలా చేస్తే పాల గిన్నె చల్లగా ఉంటుంది. పాలు కూడా గది ఉష్ణోగ్రత కన్నా తక్కువ వేడి వద్దే ఉంటాయి. కాబట్టి త్వరగా పాడైపోవు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రిజ్ పాడైతే పాలు చెడిపోతాయేమోనని భయపడకుండా పైన చెప్పినట్టు పాలను రక్షించుకోండి.
Share your comments