Health & Lifestyle

గ్లుటెన్ ఫ్రీ ధాన్యాల గురించి తెలుసుకోండి.

KJ Staff
KJ Staff

మనం సాధారణంగా బ్రెడ్, పాస్తా, పిజ్జా, ధాన్యాలు వంటివన్నీ తీసుకుంటూ ఉంటాం. వాటన్నింటిలోనూ గ్లుటెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇవి ఎక్కువగా బార్లీ, గోధుమలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

దీంతో పాటు సోయా సాస్, క్యాండీలు కొన్ని ఇతర ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లో ఉంటుంది. అయితే కొందరికి ఈ గ్లుటెన్ అస్సలు పడదు. దీనివల్ల కడుపు నొప్పి, కడుపుబ్బరం, రాషెస్, దద్దుర్లు, దురద వంటివన్ని వస్తుంటాయి. ఇలాంటి వారు గ్లుటెన్ లేని ధాన్యాలు మాత్రమే తీసుకోవాలి. ప్రస్తుతం భారత్ లో లభించే గ్లుటెన్ ఫ్రీ ధాన్యాల్లో మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు. ఈ గ్లుటెన్ ఫ్రీ ధాన్యాలు గోధుమలకు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. సీలియాక్ వ్యాధులు ఉన్నవారు ఇలాంటి ధాన్యాలనే ఎంచుకోవాలి. వీటిని రోజువారీ డైట్ లో భాగంగా తీసుకోవడం మంచిది. సాధారణంగా మనం తీసుకునే ధాన్యాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కొన్ని విటమిన్ లేదా మినరల్స్ స్థాయులు తగ్గకుండా కాపాడతాయి. అందుకే ధాన్యాలను ఒక్కసారిగా మానేయడం సరికాదు. గ్లుటెన్ ఎలర్జీ ఉంటే అది లేని కొన్ని ధాన్యాలను ఎంచుకోవడం మంచిది.

అవేంటంటే..

బియ్యం:

బియ్యం అనేది మన దక్షిణాదిలో ఎక్కువగా తీసుకునే ఆహారం. ఇందులో గ్లుటెన్ కూడా ఉండదు. కాబట్టి గ్లుటెన్ ఎలర్జీ ఉన్నవారు అన్నాన్ని ప్రశాంతంగా తినవచ్చు. మన దగ్గర బియ్యంలో ఎన్నో రకాల వెరైటీలున్నాయి. ఏ వెరైటీలోనూ గ్లుటెన్ ఉండదు. వీటితో పాటు డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ వంటి ఎన్నో రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని అన్నంగా వండుకోవడం మీకు ఇష్టం లేకపోతే బియ్యప్పిండితో రొట్టె, ఇడ్లీలు, దోశలు వంటివెన్నో తయారుచేసుకోవచ్చు.

ఓట్స్:

ఓట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా చాలా మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. ఓట్స్ సాయంతో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకోవచ్చు. ఓట్స్ పౌడర్ చేసుకొని దోశల్లా చేసుకోవచ్చు. కుకీస్ చేసుకోవచ్చు. ఓట్స్ ని గ్రనోలా బార్స్ లో భాగంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఓట్స్ అవెనిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది కూడా గ్లుటెన్ లాంటిదే. అయితే ఇది చాలామందిలో ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. కానీ కొందరిలో మాత్రం ఎలర్జీలను కలిగిస్తుంది. అందుకే ఒకవేళ మీరు గ్లుటెన్ ఎలర్జీతో బాధపడుతుంటే ఒకటి రెండు సార్లు కొద్ది మోతాదులో ఓట్స్ తీసుకోండి. మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి. లేదా ఓట్స్ తీసుకోవడం మానేయండి.

బక్ వీట్:

బక్ వీట్ ని హిందీలో కుట్టూ అని కూడా పిలుస్తారు. ఉత్తరాదిలో ఎక్కువ మంది దీన్ని వ్రతంలో ఉన్నప్పుడు ఆహారంగా తీసుకుంటుంటారు. నవరాత్రి సమయంలో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భావిస్తారు. ఇది కూడా గ్లుటెన్ ఫ్రీ ధాన్యమే. కాబట్టి గోధుమ పిండికి బదులు బక్ వీట్ పిండిని ఉపయోగించి రకరకాల వంటకాలు చేసే వీలుంటుంది. దీంతో రొట్టెలు, పూరీలు, దోశలు వంటివన్నీ చేసే వీలుంటుంది.

మిల్లెట్స్:

గోధుమలకు ప్రత్యామ్నాయంగా సజ్జలు, జొన్నలు, రాగులు, ఊదలు, వరిగెలు వంటివన్నీ పూర్వ కాలం నుంచి చాలామంది ఉపయోగిస్తూ వస్తున్నవే. ఈ ధాన్యాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వీటిని శీతాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ వీటిలో ఉన్న ఐరన్, ఫాస్పరస్, ఫైబర్, ప్రొటీన్ వంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ ధాన్యాలతో కిచిడీ, దలియా వంటివి చేయవచ్చు. వీటిని పిండి చేసి రొట్టెలు, దోశల వంటివి కూడా చేయవచ్చు.

తోటకూర గింజలు:

మయన్ కాలం నాటి నుంచి ఉపయోగిస్తున్న ధాన్యాల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఇలా తోటకూర గింజలతో లడ్డూలు చేస్తుంటారు. అయితే దీన్ని పిండి పట్టించి దాన్ని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ ధాన్యంతో ఖీర్, టిక్కీలు, పాయసం, ఎనర్జీ బార్స్, లడ్డూలు వంటివన్నీ తయారుచేసుకోవచ్చు. అంతేకాదు.. సూపుల్లో కూడా కార్న్ ఫ్లోర్ బదులుగా ఉపయోగించవచ్చు. జెల్లీ, సాస్ లు తయారుచేసుకోవచ్చు.

క్వినోవా:

ప్రస్తుతం మన దేశంలో క్వినోవా ఎక్కువగానే లభిస్తోంది. పాపులర్ గా కూడా మారుతోంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే ఆరోగ్యకరమైన ధాన్యాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పులో ఎనిమిది గ్రాముల ప్రొటీన్ అందుబాటులో ఉంటుంది. ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అలాగే వండుకోవడం లేదా క్వినోవా పిండితో దోశలు, బ్రెడ్ వంటివి చేయడం చేసుకోవచ్చు.

https://krishijagran.com/health-lifestyle/why-you-must-eat-gluten-free-diet-at-regular-intervals/

https://krishijagran.com/health-lifestyle/benefits-of-adding-millets-to-your-diet/

Share your comments

Subscribe Magazine