Health & Lifestyle

మీరు కొనే కూరగాయలు, పండ్లు ఆర్గానిక్ అవునా? కాదా? ఎలా తెలుసుకోవాలి?

KJ Staff
KJ Staff
మీరు కొనే కూరగాయలు, పండ్లు ఆర్గానిక్ అవునా?కాదా?
మీరు కొనే కూరగాయలు, పండ్లు ఆర్గానిక్ అవునా?కాదా?

ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇవి చాలా ఎక్కువ ఖరీదులో లభిస్తుంటాయి.

వీటికి కారణం అవి పురుగుల మందులు, ఎరువులు ఉపయోగించకుండా పండించినవి కాబట్టి. ఇవి పంటకు రావడానికి మామూలు కంటే ఎక్కువ సమయం పడుతుంది. పురుగుల మందులు వేయకుండా పండించినవి కాబట్టి చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ చాలా చోట్ల ఆర్గానిక్ పేరుతో మామూలు కూరగాయలు, పండ్లనే అమ్ముతున్నారు. ఇలా వినియోగదారులను మోసం చేస్తున్నారు. మరి, మీరు కొనే కూరగాయలు, పండ్లు ఆర్గానిక్ అవునా? కాదా? అన్న విషయం కెమికల్ టెస్టింగ్ లేకుండా చూడగానే చెప్పడానికి ఏం చేయాలో తెలుసుకుందాం..

చిన్న సైజ్:

పెద్ద సైజ్ లోని కూరగాయలు చూసి చాలామంది బావున్నాయి కదా అని భావించి వాటిని కొనేందుకు ప్రయత్నించకండి. సింథటిక్ ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలు పెద్ద సైజ్ లో ఉంటాయి. ఆర్గానిక్ కూరగాయలు ఎరువులు ఉపయోగించకుండా పండిస్తారు కాబట్టి చిన్న సైజ్ లో ఉంటాయి. అయితే హైబ్రిడ్ జాతివైతే ఆర్గానిక్ అయినా కాస్త పెద్ద సైజ్ లోనే ఉంటాయి. దేశవాళి కూరగాయలకు వీటికి ఈ విధంగా సులువుగా తేడా గుర్తించే వీలుంటుంది.

రుచి, వాసన కూడా..

ఆర్గానిక్ కూరగాయలు, పండ్లతో పోల్చితే రసాయన ఎరువులు వేసి పండించిన కూరగాయలు మంచి వాసన, రుచి కలిగి ఉంటాయి. అంతే కాదు.. ఇలా పండించిన పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అదే ఆర్గానిక్ పండ్లు కాస్త పులుపుదనం కలిగి ఉంటాయి. కూరగాయలు కూడా పెద్దగా వాసన లేకుండా సాధారణ రంగుతో ఉంటాయి. అయితే సహజంగా పండించినవి రుచి కూడా చాలా బాగుంటాయి. వీటితో వండిన కూరలు తక్కువ దినుసులు వేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆర్గానిక్ పండ్లు, కూరగాయల్లో గింజలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బొప్పాయి, జామ, టమాట, వంకాయ వంటివి చూస్తే సహజసిద్ధంగా పండించిన వాటిలో చాలా ఎక్కువగా గింజలు ఉంటాయి.

షేప్ కూడా...

ఆర్గానిక్ కూరగాయలు రసాయన ఎరువులు వేసిన వాటితో పోల్చుకుంటే రంగులో, షేప్ లో కాస్త తేడాగానే ఉంటాయి. అవి చూసేందుకు పెద్దగా అందంగా కనిపించవు. అలాగే రెండు కాయలు లేదా పండ్లు తీసుకుంటే ఆ రెండు విభిన్న సైజ్, షేప్ లను కలిగి ఉంటాయి. వాటి చర్మం కూడా బరకగా ఉంటుంది. ధాన్యం సంగతి తీసుకుంటే ఆర్గానిక్ గా పండించిన ధాన్యం కాస్త పసుపు రంగులో ఉంటుంది.

పురుగులు కూడా..

చాలామంది కూరగాయలు, పండ్లలో ఎలాంటి పురుగులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ సహజంగా పెంచిన కూరగాయలు, పండ్ల కోసం ఎలాంటి ఎరువులు ఉపయోగించట్లేదు కాబట్టి వీటిలో పురుగులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఒకవేళ పురుగులు కనిపిస్తే వాటికి పురుగుల మందులు తక్కువగా ఉపయోగించారని భావించి వాటిని వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఇందుకు గాను మీరు ఉప్పు వేసిన నీటిలో వాటిని నానబెట్టి తర్వాత వండుకోవడం లేదా నేరుగా తినడం చేయవచ్చు. పప్పులు, బియ్యం వంటివాటికి పురుగు పట్టితే వాటిని ఎండబెట్టడం, శుభ్రంగా కడగడం వంటివి చేయవచ్చు.

అది కూడా తక్కువే.

ఆర్గానిక్ ఆహార పదార్థాల షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఇవి కోసిన నాలుగైదు రోజుల్లోనే పాడైపోతాయి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద రెండు మూడు రోజుల కంటే వీటిని ఉంచకపోవడం మంచిది. కావాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. అదే పురుగుల మందులు జల్లి పండించిన కూరగాయలు చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అంతేకాదు.. ఆర్గానిక్ ఆహార పదార్థాలను తయారుచేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇవి రుచి కూడా చాలా బాగుంటాయి. తొందరగా ఉడుకుతాయి.

ఈ చిట్కాలను పాటించి ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను గుర్తించడం వల్ల వాటిని సులువుగా కొనుగోలు చేసే వీలుంటుంది. తద్వారా ఎక్కువ ధరకు కెమికల్స్ వాడిన ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్త పడవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ మోసాలకు చెక్ పెట్టి, ఆరోగ్యకరమైన ఆహారం కొనుగోలు చేసి తినే వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine