Animal Husbandry

చూడి పశువులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు!

Srikanth B
Srikanth B
Management practices in dairy farming
Management practices in dairy farming



చూడి అనగా – పశువులు ఎదకి వచ్చిన సమయంలో కృత్రిమ గర్భధారణ వలన లేదా ఆంబోతు సంపర్కం వలన అండం మరియు వీర్యకణాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడి గర్భాశయంలో పెరగడాన్ని చూడి అంటారు.
చూడి కాలం అనగా – పశువులో సంయుక్త బీజం ఏర్పడిన సమయం నుండి ఈనే వరకు గల కాలాన్ని చూడి కాలం అని అంటారు. ఈ చూడి కాలం గేదెలలో 310 రోజులు, ఆవులలో 280 రోజులు ఉంటుంది. ఈ చూడి కాలాన్ని 3 భాగాలుగా విభజించినప్పుడు ఇందులోని మొదటి 3 నెలల కాలాన్ని మొదటి ట్రైమిస్టర్ అని, తరువాతి 3 నెలల కాలాన్ని రెండోవ ట్రైమిస్టర్ అని, చివరి మూడు నెలల కాలాన్ని మూడవ ట్రైమిస్టర్ అని పిలుస్తారు. పిండం పెరుగుదలలో 70 శాతం మూడవ ట్రైమిస్టర్ లో జరుగుతుంది.



చూడి పశువులు బయటకు కనబరిచే కొన్ని లక్షణాలు


1. చూడి పశువులు ఎదకి రాకపోవుట.
2. పెయ్యలలో పోదుగు పరిమాణం 4-5 నెలల నుండి పెరుగుట.
3. పశువు శరీర బరువు పెరుగుట.
4. పొట్ట భాగంలో పరిమాణం పెరుగుట.
5. పాల దిగుబడి తగ్గుట.


చూడి పశువులు లోపల కనబరిచే కొన్ని లక్షణాలు
1. చేతిని పాయువు ద్వారా పెట్టి గర్భాశయమును పట్టుకొని గమనించినప్పుడు పిండం వైపున్న గర్భాశయ కొమ్ము పెరిగి ఉండును.
2. గర్భాశయం 4వ నెల నుండి పొట్టలోనికి జారిపోవును.
3. ఫ్రిమిటస్ ద్వారా 4వ నెల నుండి చూడిని గుర్తించవచ్చును.
4. 100వ రోజు నుండి అనగా 3.5 నెలల కాలం నుండి పిండం గర్భాశయంలో చేతికి స్పష్టంగా తగులుతుంది.
5. పిండం చుట్టూ ఉన్న కార్పస్ లుటియంను కూడా గుర్తించవచ్చును.
చూడి పశువులకు అవసరమయిన స్థల వివరములు
1. చూడి పశువులకి 10x10 అడుగుల పొడువు మరియు వెడల్పు కలిగి 9 – 10 చదరపు మీటర్ల స్థలం వదలాలి.
2. మెతకు, నీటికి 1&1/2 – 2 చదరపు మీటర్ల స్థలాన్ని వదలాలి.
3. పశువు ఈనే దినములలో వరి గడ్డిని బెడ్డింగ్ గా పక్కన పరచాలి.
4. వీటికి తగినంత గాలి మరియు వెలుతురు లభించేటట్లు చూసుకోవాలి.

చూడి పశువుల పోషణ వివరములు
చూడి పశువులు మంచి దూడను పెట్టి , అధిక పాలను ఇవ్వాలంటే మంచి పోషణ చాలా అవసరం. చూడి పశువులకి పచ్చగడ్డి, ఎండుగడ్డితో పాటుగా 2కే‌జిల దాణాని కూడా పెట్టవలెను. దాణాలో ఖనిజ లవణ మిశ్రమంతో పాటుగా విటమిన్ డి మరియు ఏ ని కూడా కలిపి ఇవ్వవలెను. చూడి పశువులకు వాటి శరీర పోషణకు మరియు గర్భంలోని పిండము యొక్క పెరుగుదల కోసం అదనపు మేత మరియు అదనపు దాణా ఇవ్వవలిసి ఉంటుంది. చూడి పశువులకి ఈ విధంగా అధిక దాణాను అందించడాన్ని స్టీమింగ్ ఆఫ్ అని అంటారు. చూడి పశువులు ఈనే 2 నెలల ముందు పాలు పితుకుట ఆపి వేయవలెను. దీనినే డ్రయ్యింగ్ ఆఫ్ అనిమల్ అని అంటారు.

చూడి పశువులలో ఈనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:


1. పశువు ఈనడానికి 2-3 రోజుల ముందు నుండి పొదుగు పెద్దది అవుతుంది. పొదుగు నుండి ముర్రు పాలు కారుతుంటాయి.
2. ఈనే లక్షణాలు కనపడగానే దానిని వెంటనే దానిని వేరుగా శుభ్రమైన వరిగడ్డితో పక్క వేసి ఉంచాలి.
3. ఈనడానికి 2 గంటల ముందు బాగా రుబ్బిన రాగులు, సజ్జలు, మొక్క జొన్నలు వంటివి ఉడకబెట్టి బెల్లం మరియు సోడా పొడి కలిపి పెట్టాలి.
4. పశువుకు నొప్పులు మొదలైన రెండు గంటల్లోగా ఈనాలి. ఒక వేల ఈనకపోయినట్లైతే వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి అంతేకాని లోపల నుండి దూడను లాగడానికి ప్రయత్నించకూడదు.
5. నొప్పులు మొదలైన 2 గంటల్లో ఈనకపోతే దూడ బయటికి వస్తుందో లేదో గమనించాలి. ముందరి కాళ్ళు, తల బయటికి వస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదు. తల ఒకటే లేదా తల ఒక కాలు లేదా వెనుక కాలు వస్తే ఈనడం కష్టం. ఇటువంటి పరిస్థితులలో పశువైద్యుని సహాయం తీసుకోవాలి.

చూడి పశువులు ఈనిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు:


1. దూడ పుట్టగానే దాని ముక్కు రంధ్రాలు శుభ్రపరిచి శ్వాస అందేలా చేసి, బొడ్డు పేగును కత్తిరించి టించర్ అయోడిన్ పూయలి.
2. ఈనిన 12 గంటల్లోగా మాయ పడవలెను లేని యెడల దానిని ‘’ మాయ వేయక పోవడం ‘’ (Retained Placenta) అని అంటారు.
3. ఇలాంటి సందర్భాలలో రిప్లాంటా ఔశదమును 100గ్రా బెల్లంలో కలిపి తినిపించాలి. తరువాత కూడా మాయ పడకపోతే ప్రతి 4 – 6 గంటలకు 50 గ్రా చొప్పున తినిపించాలి.
4. పశువు పరిస్థితిని బట్టి ఈనక ముందు ఈనిన తరువాత కాల్షియం బొరొగ్లూకోనేట్ ఇంజెక్షన్ ఇచ్చినట్లైతే పాల జ్వరం వచ్చే అవకాశం తగ్గుతుంది.
5. ఈనిన తరువాత పశువుకి గంజి లాంటి ఆహారం ఇవ్వాలి. 2 – 2 ½ కే‌జిల తవుడు వంటివి ‘’ మొలాసిస్ ’’ తో గాని నీటితో గాని కలిపి తినిపించినట్లైతే మంచిది.
6. పాడి పశువులు ఈనిన తరువాత పాల దిగుబడి బట్టి ప్రతి 2 ½ లీటర్ల పాలకు 1 కేజీ మిశ్రమ దాణా ఇవ్వాలి. ఈనిన 60 – 90 రోజులలోపు మరలా తిరిగి గర్భధారణ చేయించాలి.
డా. జి. మిథున్, Ph.D. విద్యార్థి,
పశువైద్య విస్తరణ విభాగము

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More