Health & Lifestyle

తినే పుట్టగొడుగులను గుర్తించడం ఇలా..

KJ Staff
KJ Staff

పుట్టగొడుగులు తిని కొంతమంది చనిపోయారని అప్పుడప్పుడూ మనం వార్తలు చూస్తూనే ఉంటాం.

ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మారుమూల ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చదివినప్పుడు సహజంగా పండించే పుట్టగొడుగుల్లో ఏవీ తినకూడదేమో.. అసలు పుట్టగొడుగులుగా అమ్మేవన్నీ సురక్షితమేనా అన్న అనుమానాలు రావడం సహజమే. ఈ పుట్టగొడుగులు తిని మరణించడానికి కారణం ఈ అడవి పుట్టగొడుగులు హెపటో టాక్సిక్ గా ఉంటాయి. ఇవి తినగానే లివర్ ని డ్యామేజ్ చేస్తాయి. ఇందులోని విషం మనుషులను వెంటనే చంపేయగలదు కాబట్టే వీటిని డెత్ క్యాప్ అని కూడా పిలుస్తారు. ఇదంతా విన్నప్పుడు పుట్టగొడుగులు మంచివి అని వింటాం. ఇలా టాక్సిక్ అని కూడా వింటాం. ఈ రెండిట్లో ఏది నమ్మాలి? అనుకుంటారు. ఈ రెండూ నిజమే.. కొన్ని రకాల పుట్టగొడుగులు మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడితే మరికొన్ని రకాల పుట్టగొడుగులు విషాన్ని చిమ్ముతాయి. అందుకే తినే పుట్టగొడుగులు, విషపూరితమైన పుట్టగొడుగుల్లో తేడా తెలుసుకొని వాటిని తీసుకోవాలి.

ఈ రెండింటి మధ్య తేడా ఎలా కనుక్కోవాలి?

సాధారణంగా విషపూరితమైన పుట్టగొడుగులు ఇవి.. ఇవి మంచి పుట్టగొడుగులు అని మన కంటితో చూసి చెప్పడం కాస్త కష్టమే. అయితే కొన్ని సూచనల ఆధారంగా విషపూరితమైనవేమో అన్న అనుమానం ఉన్నవాటిని తీసుకోకుండా దూరంగా ఉంచవచ్చు.

* ఒకవేళ ఏదైనా పుట్టగొడుగు ఎరుపు రంగు క్యాప్ లేదా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎర్రగా ఉన్న అన్ని పుట్టగొడుగులు ప్రమాదకరమైనవి కావు. కానీ ఏది ఎలాంటిదో తెలుసుకోలేనప్పుడు ఇలాంటివాటికి దూరంగా ఉండడమే మంచిది.

* కింద భాగం ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇలా ఉన్న అన్నీ ప్రమాదకరమైనవి కావు. కానీ ఎందుకైనా మంచిది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

* పుట్టగొడుగు కాండం చుట్టు తెలుపు రంగు గీతలు కనిపిస్తే వాటిని దూరంగా ఉంచాలి.

* మీకు ఏదైనా పుట్టగొడుగును చూస్తే ఇది ప్రమాదకరమైనదేమో అని అనుమానం వస్తే దాన్ని తీసుకోకపోవడం మంచిది. తీసుకొని ఇబ్బందులు పడడం కంటే ఇది నయం కదా..

ఈ అపోహలు నమ్మకండి.

* పుట్టగొడుగును పీల్ చేస్తే (పొట్టు తీసేస్తే) అందులోని విషం ఏదైనా ఉంటే అది పోతుంది

చాలామంది పుట్టగొడుగులో విషం ఏదైనా ఉంటే పొట్టులోనే ఉంటుందని అది తీసేస్తే లోపలి భాగం అంతా బాగుంటుందని భావిస్తారు. కానీ ఇది సరికాదు. విషపూరితమైన వాటిలో పూర్తిగా అన్ని భాగాల్లో విషం ఉంటుంది.

* చెట్టుపై పెరిగితే విషం ఉండదు

ఇది కూడా నిజం కాదు. ఫునరల్ బెల్ మష్రూమ్ అనే పుట్ట గొడుగు కేవలం చెట్ల మీదే పెరుగుతుంది. పేరులో ఉన్నట్లే ఇది చాలా విషపూరితమైనది. అందుకే చెట్లపై పెరిగాయి కదా అని మంచివి అని భావించకండి.

* జంతువులు తింటే మనుషులకీ మంచివే..

కొంతమంది జంతువులు పుట్టగొడుగులను తిని వాటికి ఏమీ కాకుండా ఉంటే వాటి వల్ల మనుషులకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు అని భావిస్తారు. కానీ వాటి జీర్ణ వ్యవస్థకు మన జీర్ణ వ్యవస్థకు ఎన్నో తేడాలుంటాయి. అందుకే అవి ఫంగస్ ని అరిగించుకోగలవు. కానీ మనం అరగించుకోలేం. ఉదాహరణకు ఆవులు పేపర్లు తిన్నా వాటికి అవి సులభంగా అరిగిపోతుంది. కానీ మనకు అరగవు కదా..

విషపూరిత పుట్టగొడుగులను గుర్తించే అంశాలు

* అవి పెరిగే ప్రదేశాలు – అవి చెట్లు, గడ్డి, మురుగు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.

* పెరిగే తీరు – ఒక గుత్తిలాగా లేదా రింగ్ షేప్ లో పెరుగుతాయి.

* వాసన – విషపూరిత పుట్టగొడుగులు ఒకరకమైన వింత వాసన కలిగి ఉంటాయి.

* అవి కట్ చేసినప్పుడు రంగు మారతాయి.

* పుట్టగొడుగుల క్యాప్స్ కూడా మామూలు వాటికి భిన్నంగా ఉంటాయి.

* వీటిలోపల భాగం కూడా భిన్నంగా ఉంటుంది.

* కేవలం వర్షాకాలం, చలికాలాల్లోనే ఇలాంటివి ఎక్కువగా పెరుగుతాయి.

తీసుకునేటప్పుడు ఎలాంటివి ఎంచుకోవాలంటే.. ?

పుట్టగొడుగుల వల్ల శరీరం విషపూరితం కావడాన్ని మైసెటిస్మస్ అని పిలుస్తారు. దీన్ని తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు

* వాడిపోయిన పాడైన పుట్టగొడుగులను ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఫ్రెష్ గా నిండుగా ఉంటేనే వాటిని ఎంచుకోవాలి.

* కట్ చేసినట్లుగా అనిపించినా కూడా తీసుకోకపోవడం మంచిది.

* కాండం చుట్టూ తెల్లని రింగ్స్ ఉన్నవాటిని తీసుకోకపోవడం మంచిది. అలాగే గొడుగు ఆకారంలో ఉన్నవి కూడా తీసుకోవద్దు. ఇలాంటి పుట్టగొడుగులు అమనిటాస్ వెరైటీకి చెందినవి. ఇవి చాలా హానికరమైన విషాన్ని కలిగి ఉంటాయి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు తెల్లగానే ఉన్నా.. పెరిగే కొద్దీ బ్రౌన్ రంగులోకి మారతాయి.

* ముడతలు పడినట్లుగా ఉన్నవాటిని తీసుకోవద్దు.

* కొన్ని పుట్టగొడుగులు కమ్మటి వాసనతో ఉంటాయి. వాటిని తీసుకోకపోవడం మంచిది. అలాగే చిన్నగా బ్రౌన్ రంగులో ఉన్నవాటిని కూడా దూరంగా ఉంచాలి. ఇవి ఓంఫాలోటస్ ఒలేరియస్ రకానికి చెందినవి కావచ్చు. ఇది కూడా చాలా విషపూరితమైన గిల్డ్ మష్రూమ్ రకానికి చెందినది.

పుట్ట గొడుగులు తీసుకునేటప్పుడు ఏదైనా పెద్ద ఫుడ్ స్టోర్ లేదా మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. అలాగే మీరు కూడా పుట్ట గొడుగులను తెంపుకొని తినడం సరికాదు.

https://krishijagran.com/health-lifestyle/nutritional-value-and-health-benefits-of-mushroom/

https://telugu.krishijagran.com/health-lifestyle/brief-guide-on-growing-button-mushrooms/

Share your comments

Subscribe Magazine