Agripedia

మీకు తెలుసా? కాప్సికం సాగుతో లక్షల్లో ఆదాయం పొందవచ్చని

KJ Staff
KJ Staff

ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్స్ లోను మరియు పిజ్జాల పై టాపింగ్స్ గాను కాప్సికం వాడుతుంటారు. కాప్సికం మిర్చి కుటుంబానికి చెందిన, సొలనేసి జాతికి చెందిన మొక్క. వాడుక భాషలో కాప్సికంని సిమ్లా మిర్చి అనికూడా పిలుస్తాం, కానీ మిర్చి అంత ఘాటు కాప్సికంలో ఉండదు. కాప్సికం మనకు ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు రంగుల్లో లభ్యమవుతాయి. కాప్సికం తినడం ద్వారా విటమిన్-ఏ, సి శరీరానికి లభిస్తాయి.

కాప్సికం సాగు ఖర్చుతో కూడుకున్నప్పటికీ చివరిలో మంచి లాభాలు పొందవచ్చు. కాప్సికం చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి కాప్సికంను ఇప్పుడు షేడ్ నెట్లోను, పాలీహౌస్ లోను సాగు చేస్తున్నారు. పాలీహౌస్ లో సాగు చెయ్యడం ద్వారా సంవత్సరం మొత్తం కాప్సికం పంట నుండి దిగుబడిని పొందవచ్చు.

కాప్సికం పెరిగేందుకు పగటిపూట 21-29 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం, అలాగే రాత్రివేళల్లో గరిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో మొక్క ఎదిగేందుకు అనువుగా ఉంటుంది. పాలీహౌస్ కల్టివేషన్ ద్వారా మొక్క ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని ఏడాది మొత్తం కల్పించవచ్చు. అంతే కాకుండా చీడ పీడల నుండి మరియు భిన్న వాతావరణ పరిస్థితుల నుండి పంటను కాపాడుకోవచ్చు.

కాప్సికం రకాలు:

పాలీహౌస్ లో కాప్సికం సాగు చేసే రైతులు, మేలైన రకాలను ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలను ఎంచుకుంటే కాప్సికం నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఎరుపు రంగు కాప్సికం రకాలు ఇంద్ర, ఇన్స్పిరేషన్ రంగు పసుపు కాప్సికం రకాలు బకర్త, ఉరవెల్లి మరియు పచ్చ రంగులో ఇంట్రుడర్ వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. కాప్సికం పండిన తర్వాత మాత్రమే నిర్దిష్టమైన రంగును సంతరించుకుంటుంది. ఒక పాలీహౌస్ లో కాప్సికం సాగుకు 40 గ్రాముల విత్తనాలు అవసరం.

పంట ప్రారంభానికి కనీసం ముపై రోజుల ముందు నుండి పైరుని తయారుచేసుకోవాలి. మట్టి, కోకోపీట్ నింపిన ట్రేలో విత్తనాలు నాటి ఒక ముపై రోజుల పాటు పైరును పెంచాలి. ఈ విధానం ద్వారా మొక్క చిన్నగా ఉన్నపుడు వచ్చే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళును నివారించవచ్చు.

ఈ మొక్కలను పాలీహౌస్ లో నాటుకునేందుకు, 90 సెంటీమీటర్లు వెడల్పుతో తయారుచేసుకున్న బెడ్స్ పై మొక్కలను నాటుకోవాలి. ప్రతీ మొక్కకు మధ్య కనీసం 50 సెంటీమీటర్ల దూరం ఉండాలి. బిందు సేద్యం ద్వారా కాప్సికం పంటను పెంచడం ద్వారా నీటి వృథా తగ్గి, తక్కువ నీటితోనే మంచి దిగుబడిని పొందవచ్చు. మట్టిలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. వాతావరణంలో తేమ అధికంగా ఉంటె మొక్క ఎదుగుదల మందగిస్తోంది కనుక తేమను నియంత్రించడం చాల ముఖ్యం.

భిందు సేద్యం ద్వారా మరొక్క ఉపయోగం ఏమిటంటే నీటిలో కరిగే ఎరువులను మొక్కకు నేరుగా అందించవచ్చు. నీతితో పాటు పోషకాలు కూడా అందడం ద్వారా మొక్క ఎదుగుదల బాగుంటుంది. కాప్సికం మొక్కలు కనీసం 10 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి, కాయబరువుకు మొక్క పడిపోకుండా ఉండేదుకు జిఐ వైరుల ద్వారా కొమ్మలకు తాడు కట్టి సపోర్ట్ అందించాలి. పాలీహౌస్లో కాప్సికం సాగు ద్వారా చీడపీడలను నివారించవచ్చు అయితే పాలీహౌస్ లోపల తేమ అధికంగా ఉన్నట్లైతే ఆకుమచ్చ తెగులు, బుడిద తెగులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ తెగుళ్లను నియంత్రించడానికి కార్బెడిజిమ్+మాంకోజెబ్ 2గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

మార్కెట్లో ఎరుపు మరియు పసుపు రంగు కాప్సికంకి ఎక్కువ గిరాకి ఉంది. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు వీటిని కొనుగోలు చేస్తాయి. అలాగే ఇక్కడ పండిన కాప్సికంకు విదేశీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో చాల మంది రైతులు పాలీహౌస్ ద్వారా కాప్సికం పండించి మంచి లాభాలు పొందుతున్నారు.

Share your comments

Subscribe Magazine