News

తెలంగాణ రైతులకు శుభవార్త.. ధరణి పోర్టల్ లో కొత్త ఆప్షన్.. పాస్ బుక్ లేకపోయినా..

KJ Staff
KJ Staff

తెలంగాణ సర్కార్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే భూముల రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్‌లు, ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించడానికి ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయాయి.ముఖ్యంగా భూయజమాని మరణించడం, మరణించిన వారికి పాసుబుక్ లేకపోవడంతో ఆ భూమికి సంబంధించిన వారసులను గుర్తించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

భూమి యజమాని చనిపోతే ఆయన పేరిట పాస్‌బుక్‌ ఉంటేనే వారసులు ఆ భూమిపై హక్కులు పొందేందుకు అవకాశం ఉండేది.ఈ విధానం వల్ల ప్రజల అనేక ఇబ్బందులు పడుతుండటంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో మరో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. కొత్త విధానంతో పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునే వెసులుబాటును కల్పించారు.ధరణి పోర్టల్ ద్వారా ఇలాంటి భూసమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ,ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

ధరణి పోర్టల్‌లో అప్లికేషన్‌ ఫర్‌ సక్సెషన్‌ మాడ్యూల్‌లోనే పాస్‌బుక్‌ లేకున్నా దరఖాస్తు తీసుకునే వెసులుబాటును ధరణి పోర్టల్‌లో కల్పించారు. ముందుగా ధరణి పోర్టల్ ల్లో అప్లికేషన్ ఫరస్ సక్సెషన్ ఓపెన్ చేయలి. అనంతరం అప్లికేషన్‌ వితవుట్‌ పాస్‌బుక్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఆ తర్వాత భూమి వివరాలు, మరణించిన వ్యక్తి వివరాలు, వారి వారసుల వివరాలు వంటివి నమోదుచేయాలి.

అలాగే భూయజమానికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును, ఎవరికి ఎంత వాటా కావాలో నిర్ణయించుకొని కుటుంబం మొత్తం కలిసి రాసుకున్న ఒప్పంద పత్రాన్ని కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్‌‌ వద్దకు వెళ్తుంది.

కలెక్టర్‌ దరఖాస్తును పరిశీలించిన తర్వాత భూమికి, వారసత్వానికి సంబంధించిన అన్ని విషయాలు సక్రమంగా ఉంటే కలెక్టర్ ఆ దరఖాస్తును అనుమతిస్తాడు. ఏవైనా సందేహాలు ఉంటే తిరస్కరించే అధికారం కూడా కలెక్టర్ కు ఉంటుంది. ఈ సమాచారం మొత్తం దరఖాస్తుదారు మొబైల్‌కు నెంబర్ కు మెసేజ్‌ రూపంలో పంపించడం జరుగుతుంది.

భూమిని పంచుకోవడానికి కలెక్టర్ అనుమతిస్తే వారసులు స్లాట్‌ బుక్‌ చేసుకొని నేరుగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి సక్సెషన్‌ ప్రక్రియను పూర్తిచేయాలి. ఐతే ఏవైనా సమస్యలు ఉండి, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మాత్రం ఈ ఆప్షన్‌ వర్తించదు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూమి సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరకడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine