News

రైతులకు మోదీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీ ఊరట కలిగించేలా కీలక నిర్ణయం

KJ Staff
KJ Staff

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, కష్టకాలంలో వారికి అండగా ఉండటం, వారిని ప్రోత్సహించడం కోసం అనేక స్కీమ్‌లు అమలు చేస్తోంది. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఎరువుల సబ్సిడీ లాంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని కోట్లాది రైతులు లబ్ధి పొందుతున్నారు.

ఇది ఇలా ఉంటే, తాజాగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులకు ఊరట కలిగించేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఫెర్టిలైజర్ సబ్సిడీ డబ్బులను పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో రైతులకు పాత ధరలకే డీఏపీ అందుబాటులో ఉండనుంది.

ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంపుతో రైతులు రూ.1200కే డీఏపీని కొనుగోలు చేయవచ్చు. గత ఏడాది బస్తా డీఏపీ ధర రూ.1700 ఉండేది. అప్పుడు కేంద్రం రూ.500 సబ్సిడీ ఇవ్వడంతో రూ.1200 వద్ద కొనసాగుతూ ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుదల కారణంగా ఇప్పుడు డీఏపీ రూ.2400కి చేరుకుంది. దీంతో కేంద్రం ఇప్పుడు సబ్సిడీ ధరను రూ.1200కి పెంచడంతో.. పాత ధర రూ.1200కే రైతులకు డీఏపీ లభించనుంది.

మాములుగా, అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్ల పెరుగుదల కారణంగా దేశంలోనూ డీఏపీ ధరలు పెరుగుతూ ఉంటాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించి రైతులకు తక్కువ ధరకే డీఏపీ లభించేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.1200 సబ్సిడీ అందించడం రైతులకు భారీ ఊరట అని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine