Agripedia

అరటి పిండి అద్భుతమైన రుచి మాత్రమే కాదండోయ్.. ఆరోగ్యం కూడా!

KJ Staff
KJ Staff

సాధారణంగా ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనప్పుడు పంటను తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. కనీసం రవాణా ఖర్చుల కూడా వచ్చేది కాదు. దాంతో రైతులు పంటను పొలం మీదనే వదిలి వేయడం లేదా పశువులకు, గొర్రెలకు మేతగా వేయడం చేస్తుంటారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతోంది. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తోంది కర్ణాటకకు చెందిన మహిళ రైతు నయనా ఆనంద్‌.తోటల్లో మిగిలిపోయిన అరటిపండ్లను సేకరించి వాటిని పిండిగా మార్చి గోధుమ, మైదా పిండికి ప్రత్యామ్నాయంగా అరటి పొడిని వాడవచ్చునని చెబుతోంది.

కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా అరటి సాగు చేస్తున్నారు.లాక్‌డౌన్‌ సమయంలో కేజీ రూ.4-5 మాత్రమే చెల్లించి నాణ్యమైన అరటిని మాత్రమే దళారులు కొనేవారు. మిగిలిన పెద్ద మొత్తంలో అరటి గెలలు రైతుల దగ్గరే మిగిలిపోయేవి. అరటి ఎక్కువ రోజులు నిల్వ ఉండే పంట కాదు కాబట్టి వృధాగానే కాయలన్నీ పాడైపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన నయనా ఆనంద్ అరటికాయ నుంచి ఏవైనా ఉత్పత్తులు చేయవచ్చు నేమో అని ఆలోచిస్తున్న తరుణంలో, కేరళకు చెందిన మహిళ నేంద్రన్‌ అరటి రకం నుంచి పొడిని తయారుచేసి అమ్ముతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది.

కేరళలో అరటి పొడిని చిన్న పిల్లలకు ఆహారంగా పెడతారు.అందుకే అక్కడ ఆ పొడికి గిరాకీ ఉంది.నయనా ఆనంద్ కూడా అరటి కాయ, పండ్ల నుంచి అరటి పొడిని ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీ పాద్రే అనే జర్నలిస్టు ఆమెకు కేవీకేలోనే పనిచేసే జిస్సీ జార్జ్‌ని పరిచయం చేశారాయన.
అక్కడ అరటికాయ నుంచి అరటి పొడిని ఎలా తయారు చేయాలో శిక్షణ తీసుకుంది.

అరటికాయ లేదా పండు నుంచి అరటి పొడిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక పాత్రలో 800 మి.లీ. నీరు, 200 మి.లీ. గంజి కలిపి తీసుకోని దాన్లో పది గ్రాముల ఉప్పు కలపాలి. తొక్క తీసిన పచ్చి లేదా పండిన అరటిని దాంట్లో అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత వాటిని గుండ్రని ముక్కలుగా కోయాలి. ఆ ముక్కల్ని రెండ్రోజులూ లేదంటే పూర్తిగా తేమ పోయేంత వరకూ ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిగా చేసి ఏదైనా పాత్రలో పోసి, గాలి సోకకుండా మూతపెట్టాలి. వారం తర్వాత ఆ పొడిని వాడొచ్చు. పొడి అయితే ఆరు నెలలూ, ఎండ బెట్టిన అరటి ముక్కలు ఏడాదీ నిల్వ ఉంటాయి.

అలా తయారు చేసుకున్న అరటి పొడితో ఏయే వంటకాలు చేయొచ్చో నయనా ఆనంద్ నిరంతరం శ్రమించే గోధుమపిండి, మైదాతో తయారు చేసే వంటకాలన్నీ అరటి పొడితో కూడా తయారు చేసుకోవచ్చు అని చేసి మరీ
నిరూపించింది. అరటి పొడితో తయారుచేసే చపాతీలు, బిస్కెట్లు , గులాబ్ జామ్ వంటి రుచికరమైన ఆహార పదార్థాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అరటి పొడితో తయారు చేసిన ఆహార పదార్థాలు అన్నీ పిల్లలకు బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. ఆనంద్

అరటి పొడి తయారీ విధానాన్ని, అరటి పొడితో చేసుకోగల ఆహారపదార్థాల వివరాలను పాద్రే సూచన మేరకు ఎనీటైమ్‌ వెజిటబుల్స్‌’అనే వాట్సాప్ గ్రూపులో పంచుకుంది. దాంతో అక్కడి రైతులందరూ ఈ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అరటి ముక్కల్లో తేమ పోగొట్టడానికి డ్రైయ్యర్లనీ కొంటున్నారు రైతులు. ఒక్క తుముకూరు జిల్లాలోనే రైతుల దగ్గర 1500 దాకా డ్రైయ్యర్లు ఉంటాయని చెబుతారు పాద్రే. ఈ మార్పుతో వందల మంది రైతులు అరటి కాయలూ, పండ్లతో పొడి చేస్తూ తమ పంట వృథా పోకుండా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

Share your comments

Subscribe Magazine