Agripedia

పత్తి సాగు రైతులను అధికంగా నష్టపరిచే తెగుళ్లు, నివారణ చర్యలు....

KJ Staff
KJ Staff

తెల్ల బంగారంగా ప్రసిద్ధి గాంచిన పత్తి సాగుకు రాష్ట్ర వ్యాప్తంగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో చాలా మంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి సాగులో అనేక రకాల తెగుళ్ళు వ్యాప్తి చెంది పత్తి సాగు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. పత్తి సాగు వివిధ దశల్లో వచ్చే తెగుళ్ళను సరైన సమయంలో గుర్తించి నివారణా చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చునని.

వివిధ దశల్లో వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు:

ఆకుమచ్చ తెగుళ్ళు : పత్తి పంట ను అధికంగా ఆశించే ఆల్టర్నేరియా, సెర్కోస్పోరా, హెల్మింతోస్పోరియమ్ వలన ఆకుల మీద తేలిక గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్యభాగం బూడిదరంగుతో చుట్టూ ఎర్రటి అంచులు ఏర్పడతాయి.మూడు తెగుళ్ళ నివారణకు సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసి నాటాలి. లీటరు నీటికి 2.5గ్రా మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా క్యూమాన్. ఎల్. 4 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా కాప్టాను + హెక్సాకొనజోల్ (తాకత్) 1 గ్రా. 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.

నల్లమచ్చ తెగులు : దీనినే బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. వర్షాకాలంలో తేమతో కూడిన మబ్బులు పట్టినప్పుడు ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది.పంట వివిధ దశల్లో ఎక్కువ కనిపిస్తుంది.ముందుగా ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కొమ్మలకు వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. నివారణకు ముందు జాగ్రత్తగా కిలో విత్తనానికి 10గ్రా సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ విత్తనశుద్ధి చేయాలి. ఉదృతిని బట్టి 3-4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ మరియు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి.

బూజు తెగులు : దీనిని గ్రే మిల్డ్యూ అంటారు.
ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడి, బూజు తెగులు శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 1 గ్రాము కార్బెండిజిమ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా పొడి గంధకం ఎకరాకు 8-10 కిలోలు పొలంలో చల్లుకుంటే సరిపోతుంది.

తుప్పు తెగులు : తేమతో కూడిన వాతావరణం ఎక్కువ రోజులు ఉండి అధిక వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.నవంబరు - ఫిబ్రవరి మాసాల్లో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. కాయ పక్వ దశలో ఆశించి ఆకుల పై తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా లేత ఆకులకు వ్యాపించి
చెట్టు పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది.
నివారణకు 3 గ్రా. సల్ఫెక్సు లేక 1 మి.లీ ట్రేడిమార్ఫ్ లేక 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధితో 3-4 సార్లు పిచికారి చేయాలి.

Share your comments

Subscribe Magazine