Agripedia

ఖరీఫ్ వరికి సాగుకు ముందు పచ్చిరొట్ట పంటల సాగు - వాటి ప్రాముఖ్యత!

Srikanth B
Srikanth B
ఖరీఫ్ వరికి  ముందు పచ్చిరొట్ట పంటల సాగు - వాటి ప్రాముఖ్యత
ఖరీఫ్ వరికి ముందు పచ్చిరొట్ట పంటల సాగు - వాటి ప్రాముఖ్యత

పెరుగుతున్న జనాభా, ఆహార ధాన్యాల అవసరం మేరకు గత 30-40 సంవత్సరాల నుండి అధిక దిగుబడినిచ్చే పొట్టి రకాలను సాగుచేస్తూ, రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగించి వరిలో అధికోత్పత్తి సాధించగలిగాము. కాని ఈ క్రమంలో సేంద్రియ ఎరువుల వాడకం గణనీయంగా తగ్గింది. అందుకు పర్యవసానంగా భూమి భౌతిక రసాయనిక మార్పుకులోనై, చీడ పురుగులు, తెగుళ్ళ ఉధృతి పెరిగి, ధాన్యం దిగుబడిలో స్థబ్దత ఏర్పడింది. ముఖ్యంగా నేలలో సారం తగ్గటం, చౌడు నేలలుగా తయారవడం, పంటపై సూక్ష్మధాతు లోపాలు వంటివి ప్రధాన సమస్యలుగా తయారైనవి. ఇవి ఎక్కువగా పంట మార్షిడి లేకుండా, వరి తరువాత మళ్ళీ వరి వేసే ప్రాంతాలలో గమనిస్తు న్నాము.

అందువలన ప్రస్తుత పరిస్థితులలో నేలను సంరక్షించుకొంటూ, ఉత్పాదకత పెంచాలంటే రసాయనిక ఎరువులతో పాటు, భూమిలో సేంద్రియ పదార్థ మోతాదును పెంచడానికి చర్యలు చేపట్టాలి. దీని వల్ల ఖర్చు కూడ బాగా తగ్గించుకోవచ్చు. ఇటీవల కాలంలో పశువుల ఎరువు కావలసినంత లభ్యం కావడం లేదు దీనికి ప్రత్యామ్నాయంగా నేలను సారవంతం చేసి పంటకు కావలసిన పోషకాలను అందించడంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పచ్చిరొట్ట ఎరువులు సులభంగా, చౌకగా దొరుకుతాయి.

వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చును.


పచ్చిరొట్ట పంటలు :


రైతులు అనాదిగా ఆచరించిన పచ్చిరొట్ట పంటలు జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, ఉలవ, పెసర వంటి పంటలను పెంచి అవి 50% పూత దశకు వచ్చిన తర్వాత లేదా పూత దశకు వచ్చే ముందు కాని భూమిలో కలియ దున్నడం వలన నేల స్థితిగతులను మెరుగు పరచుకొని, పలు కాలాల పాటు పంట ఉత్పాదకత శక్తిని పెంచటమే కాకుండా పెట్టుబడి ఖర్చులను కూడ ఆదాచేయవచ్చు.


మన రాష్ట్రములో జీలుగ, జీనుము, మినుము, పెసర, బబ్బెర, పిల్లిపెసర, పచ్చిరొట్ట పంటలుగా వేసుకోవడానికి అనుకూలం. జీలుగ ఎక్కువ తేమకు, ఉష్ణోగ్రతకు ఇతర ప్రాంతాల్లో చౌడు భూముల్లో కూడ వేసుకోవడానికి అనుకూలం.
జనుము చెల్కా భూముల్లో నీటి ఎద్దడి ప్రాంతాల్లో తక్కువ చౌడు, ఆమ్ల మరియు నీటి ముంపునకు గరికానటువంటి పొలాల్లో వర్షాకాలపు (ఖరీఫ్) వరికి ముందుగా వేసుకోవడానికి చాలా అనుకూలం.

పచ్చిరొట్ట ఆకు ఎరువులు :

సుబాబుల్, గైరిసిడియా, కానుగ, తంగేడు, జిల్లేడు వంటి చెట్ల నుంచి లేత కొమ్మలు, ఆకులను సేకరించి పొలంలో వేసి బాగా కలియదున్నాలి. తర్వాత నీరు పెట్టి బాగా కలియదున్నాలి.

 

వివిధ రకాల పచ్చి రొట్టె పంటలు
వివిధ రకాల పచ్చి రొట్టె పంటలు
వివిధ రకాల పచ్చి రొట్టె పంటలు
వివిధ రకాల పచ్చి రొట్టె పంటలు

ఈ విధంగా వివిధ పచ్చిరొట్ట లేదా పప్పదినుసుల పంటలను వరి మాగాణుల్లో వేసి కలియదున్నడం వలన సుమారు 25-30% నత్రజనిని ఆదా చేయవచ్చు. ఇంతే కాకుండా భూమిలోని భాస్వరము, పోటాష్ ను ఎక్కువ అందుబాటులోకి తెచ్చి సూక్ష్మ ధాతువులైన జింకు, ఇనుము మరియు మాంగనీసు లోపమును సవరించుటయే కాకుండా భూ భౌతిక పరస్థితిని అభివృద్ధి పరచి అధికోత్పత్తికి దోహద పడుతాయి. చౌడు భూములను బాగా అభివృద్ధి చేస్తాయి. ఎకరానికి 12-14 కిలోల విత్తనాలను వాడినట్లైతే కాండము లావు తక్కువగా ఉండి దమ్ముచేయుటకు అనుకూలంగా ఉంటుంది. కలియదున్నేటప్పడు ఎకరానికి 100-150 కిలోల సూపర్ ఫాసేటు వేసినట్లైతే, రొట్ట బాగా కుళ్ళి మంచి ఫలితాలిస్తుంది. పచ్చిరొట్టవేసి 30-40 రోజులలో కలియదున్నలేని పరిస్థితులలో గైరిసిడియా, సుబాబుల్, కానుగ, తంగేడు, జిల్లేడు వంటివి అందుబాటులో ఉన్నట్లయితే ఆకులను లేత కొమ్మలను పొలమంతా పరచి కలియదునవచ్చు. ఇవేకాక జీవన ఎరువులైన నీలిపచ్చ నాచు, అజోల్లా వంటివి కూడ వేసుకొని, పెంచి, దున్నినట్లైతే సుమారు 20-30 కిలోల నత్రజనిని ఆదా చేయవచ్చు.

పచ్చి రొట్ట ఎరువుల వలన ప్రయోజనాలు
చౌడు భూములను కూడా సాగులోకి తెచ్చుకొనేందుకు (చౌడు స్వభావం తగ్గించేందుకు) జీలగ వంటి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి.


  • పప్పుజాతి పంటలను పచ్చిరొట్ట ఎరువుగా వేసి భూమిలో కలియదున్నడం వలన అవి స్థిరీకరించిన నత్రజనిని తరువాతి పంటలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి.

  • నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. రసాయన ఎరువులకు అయ్యే ఖర్చును కొంతవరకు 15-20% తగ్గించవచ్చు.

  •  నేలలో బాగా చీకిన తర్వాత లేదా కుళ్ళిన తర్వాత నేలకు కావలసిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. దీని వలన భూ భౌతిక, రసాయన ధర్మాలు మెరుగుపడతాయి.

  •  పచ్చిరొట్ట కుళ్ళడం వలన నేలలో హ్యూమస్ పెరుగుతుంది. దీని వలన నేలకు నీరు, పోషక పదార్థాలను నిల్వ చేసుకొనే శక్తి పెరుగుతుంది. అంతేకాక పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  • పచ్చిరొట్ట ఎరువులను ఎంపిక చేసుకోవడంలో గమనించవలసిన అంశాలు

  •  పైరు త్వరగా ఏపుగా పెరిగి నేలను ఆక్రమించుకొనే స్వభావం కలిగి ఉండాలి. దీని వలన ఎక్కువ పరిమాణంలో పచ్చిరొట్ట ఎరువును అందించవచ్చును.

  •  కలియ దున్నినపుడు త్వరగా నేలలో కలిసిపోయే స్వభావం కలిగి ఉండాలి.

  • వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించగలిగే స్వభావం కల లెగ్యూమ్జాతి పంటలను ఎన్నుకోవాలి.

  • కొంతమంది రైతులు విత్తనం లభించడం లేదని పచ్చిరొట్ట పంటను వేయడం లేదు. కాబట్టి జీలుగ జనుము వంటి పంటలను తమ పొలంలోనే కొంతమేర వేసుకొని విత్తనోత్పత్తి చేసుకొంటే విత్తనం సకాలంలో అందుబాటులో ఉంటుంది. కొన్నిసార్లు పొలం గట్ల వెంబడి, దగ్గరగా ఉండే అడవి ప్రాంతాల్లో పెరిగే సబాబుల్, గెరిసిడియా కానుగ, తంగేడు మరియు జిల్లేడు వంటి చెట్ల నుంచి లేత కొమ్మలు, ఆకులు తీసుకొచ్చి పొలంలో వేసి బాగా కలియదున్నిన తర్వాత నీరు పెట్టి మురగనివ్వాలి.

     Author (రచయిత ):

                      డా. ఎం. వెంకట లక్ష్మి (సస్య పోక్షణ), డా. కె. రేవతి (సస్య రక్షణ), శ్రీమతి. జి.కృషవేణి (గృహ విజ్ఞానo), డా. బి. నవీన్ (విస్తరణ విభాగం),  శ్రీ.యశ్వంత్ కుమార్ (మస్త్య విభాగం), డా. వి. మంజు వాణి (ఉద్యాన విభాగం) మరియు డా. పి. శ్రీలత (ప్రోగ్రాo కోర్డినేటర్) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా– 521 133

Related Topics

kharif crops Paddy & Maize

Share your comments

Subscribe Magazine