News

రైతులకు ఆదర్శంగా నిలిచిన నిజాయితీ దుకాణం.. ఎక్కడంటే?

KJ Staff
KJ Staff

సాధారణంగా ఈ మధ్య కాలంలో రైతులు వారి తోటలో పండించిన కూరగాయలు పండ్లను రోడ్డుపక్కనే ఏర్పాటు చేసుకొని చూస్తుంటాము.ప్రజలు కూడా మార్కెట్లో లభించే కూరగాయలు కన్నా ఈ విధంగా రోడ్డు పక్కన ఉండే వాటిని కొనుగోలు చేయడానికి ఎంతో మక్కువ చూపుతున్నారు. అయితే ఈ దుకాణాల దగ్గర తోటమాలి కూర్చుని ఉండడం మనం చూస్తుంటాం. అయితే రోడ్డు పక్కన నిజాయితీ దుకాణం పేరుతో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణంలో ఎవరు ఉండరు, కేవలం కూరగాయల ధర ఎంత అనేది బోర్డు పై రాసి ఉంటుంది. కూరగాయలను కొనుగోలు చేసే వారు వారికి కావలసిన కూరగాయలు తీసుకొని అక్కడే ఒక కవర్లో డబ్బులు ఉంచితే చాలు. ఇంత విభిన్నమైన నిజాయితీతో కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం...

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌ కి చెందిన ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే వాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంతో పాఠశాలలు మూతపడటంతో మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో వివిధ రకాల పండ్లు కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ.. ఆ పంటను కొత్త పద్ధతిలో నిజాయితీ దుకాణం పేరిట వినియోగదారులకు సరసమైన ధరకు అందిస్తున్నారు.

మల్లారెడ్డి తనకున్న ఏడు ఎకరాల పొలంలో డ్రిప్ ద్వారా వివిధ రకాల పండ్లు కూరగాయలను ఎటువంటి రసాయనిక మందులు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించి తన పొలం వద్దే నిజాయితీ అనే పేరుతో ఒక దుకాణం ఏర్పాటు చేశాడు. తన పొలం జగిత్యాల 5 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిజాయితీ దుకాణానికి చేరి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కూరగాయలు కిలో ఎంత ధర అనేది ఒక బోర్డు పై రాసి ఉంటుంది.ఇక్కడికి వచ్చే కస్టమర్లు దుకాణం పేరు నిజాయితీ కావడంతో వారు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డ కుండా ఎంతో నిజాయితీగా వారు కొనుగోలు చేసిన వాడికి డబ్బులు చెల్లిస్తుంటారు.

కూరగాయలను కొనుగోలు చేసిన వినియోగదారులు డబ్బులను అక్కడే ఉన్న కవర్లో వేయడం లేదా గూగుల్ పే ఫోన్ పే వంటి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచాడు. కేవలం పండ్లు కూరగాయలు మాత్రమే కాకుండా నాటు కోళ్లు, బాతులను పెంచుతూ వాటి గుడ్లను కూడా ఈ దుకాణంలో విక్రయిస్తుంటారు. ఈ విధంగా నిజాయితీ పేరుతో దుకాణం ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నానని తెలిపారు. త్వరలోనే గొర్రెల పెంపకం చేపల పెంపకం కూడా ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లారెడ్డి తెలియజేశారు.మల్లారెడ్డి అవలంబిస్తున్న ఈ వినూత్న పద్ధతులు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine