News

పాము కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Srikanth B
Srikanth B
పాము కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పాము కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 

వానకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పాముకాటు ప్రమాదాలూ అధికంగా ఉంటాయి. రైతులు పగలు,రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వానకాలం కావడంతో గుబుగుబురు పొదలు, పొలాలు, ఏపుగా పెరిగిన చెట్ల పొదల్లో పాములు, విషపురుగులు మాటువేసి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణహాని కలుగుతుంది. పొలాల వద్ద నివాసం ఉండే వారు, చెట్ల పొదల వద్ద ఇండ్లు ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించినా పాముకాటుకు గురయ్యే అవకాశం ఉంది.

 


పాము కాటు లక్షణాలు:


• వ్యక్తిని విషపూరితమైన పాము కరిచినప్పుడు శరీరమంతా నీలం రంగుగా మారుతుంది.
• రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు.
• పాము కాటువేసిన చోట నొప్పి, వాపు ఉంటుంది. మరికొందరిలో పొక్కులు,దద్దుర్లు కనిపిస్తాయి.
• నోటి నుంచి నురగ వస్తుంది.
• ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కన్నా రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుం టుంది.
• ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు.

రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ పథకానికి కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

పాము కరవగానే:


• భయాందోళనలకు గురికావద్దు. దాని వల్ల రక్త ప్రసరణ పెరిగి విషం త్వరగా వ్యాపించే ప్రమాదముంది. బంధు మిత్రులు రోగికి ధైర్యం చెప్పాలి
• ప్రక్కనున్నవారు ఆ పాము విషసర్పమా కాదో గుర్తించే ప్ర.యత్నం చేయండి. దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా అందచేయవచ్చు
• నాటు వైద్యం, మంత్రతంత్రాలు అని ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని తీసుకువెళ్ళండి. ఆటో, అంబులెన్స్, స్కూటర్ కనీసం మంచం సాయంతో నైనా ఆసుపత్రికి తరలించండి. రోగిని నడిపించవద్దు
• అన్ని గ్రామాలకు ఇపుడు 108 ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి
• పాము కాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింత కోస్తే రక్తంతోపాటు విషయం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాము కాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం.
• మరికొందరు సినిమా హీరోలా పాము కరచినా ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాము కాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము కాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించిన సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందే వీలుంది.


పాటించాల్సిన జాగ్రత్తలు:


పాములు సాధారణంగా ఎవరిని ఏమీ చేయవు. వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రమాదమనిపించినప్పుడు, ఏకాంతానికి భంగం కలిగినా, తొక్కటం, వేటాడటం వంటి చర్యలకు ప్రతీ స్పందనగా మాత్రమే కాటు వేస్తాయి. ముందు జాగ్రత్తతో చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. పొలానికి వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళలో తిరిగే వారు, అక్కడే నిద్రించేవారు తమ వెంట తప్పనిసరిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాలు, గడ్డి వాముల్లో తిరిగే వారు మోకాళ్ల దాకా రక్షణనిచ్చే బూట్లు ధరించటం ఉత్తమం.

రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ పథకానికి కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

 

రచయితలు:

డా. బి. నవీన్, శాస్త్రవేత్త, వ్యవసాయ విస్తరణ విభాగం, డా. పి. శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త & సమన్వయ కర్త, శ్రీ. జె. యశ్వంత్ కుమార్, శాస్త్రవేత్త, మత్స్య విభాగం, జి. కృష్ణవేణి, శాస్త్రవేత్త, గృహ విజ్ఞాన విభాగం, డా. యం. వెంకట లక్ష్మి, శాస్త్రవేత్త, సస్య పోషణ విభాగం, డా. కే. రేవతి, శాస్త్రవేత్త, సస్య రక్షణ విభాగం, డా. వి. మంజువాణి, ఉద్యాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల.

Related Topics

Snake Bite

Share your comments

Subscribe Magazine